అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ సంఘాలు చేపట్టిన బంద్‌తో జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో నిరసన విజయవంతంగా కొనసాగుతోంది. GO నెం.3కి ప్రత్యామ్నాయం కల్పించడం, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం, బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయడం, హైడ్రో పవర్ ప్లాంట్లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయడం వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆదివాసీ సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.

అయితే, బంద్ సందర్భంగా పాడేరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ డిపో ఎదుట నిరసనకు దిగిన ఆదివాసీలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆదివాసీ జేఏసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పాడేరులో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆదివాసీ సంఘాల ఆందోళన కొంత ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతోంది.

న్యాయ సమీక్షలో రద్దైన జీఓ నెం.3ను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 1/70 చట్టం ద్వారా భూ బదలాయింపులపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుతున్నారు.

హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్-1లో కొనసాగించాలని ఆదివాసీలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ఆదివాసీ జేఏసీ చేపట్టిన బంద్‌కు వైసీపీ, వామపక్ష పార్టీలు, వర్తక-వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ ప్రభావంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు వ్యాలీలో కూడా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా, టెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల వరకు బస్సుల రాకపోకలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆదివాసీ జేఏసీ ప్రకటించింది.