ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించనున్నారన్న యోగి కేబినెట్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. కుల గణన పూర్తైన అనంతరం రాష్ట్ర విభజన చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని రాజ్‌భర్ పేర్కొన్నారు. పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజున తన కుమారుడే ముఖ్యమంత్రి అవుతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనపై కూటమి భాగస్వాముల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించనున్నారంటూ యోగి కేబినెట్ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కుల గణన పూర్తైన అనంతరం యూపీ విభజన ప్రక్రియ ముందుకు సాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని రాజ్‌భర్ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌ను బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్‌గా నాలుగు భాగాలుగా విభజించాలన్న డిమాండ్‌ను రాజ్‌భర్ చాలాకాలంగా వినిపిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రధాని మోదీ మద్దతు తెలిపినట్లు ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కుల గణన పూర్తైన వెంటనే రాష్ట్ర విభజనకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజున తన కుమారుడే ముఖ్యమంత్రి అవుతారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు దశల్లో జనగణన ప్రక్రియ కొనసాగుతుండగా, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికార బీజేపీ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిషాద్ పార్టీ అధినేత, రాష్ట్ర మంత్రి సంజయ్ నిషాద్ రాజ్‌భర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభజనపై ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ను విభజించే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రత్యేక నిధుల కేటాయింపుతో పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సంజయ్ నిషాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *