ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నేడు (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడులు ఉపాధి కల్పనకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.

ముఖ్యంగా ఏపీ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ 2026-31 పాలసీ, రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీల ముసాయిదాలతో పాటు ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ (4.0) పాలసీకి మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన క్లౌడ్ హబ్ ప్రాజెక్టుపైనా సమావేశంలో చర్చించనున్నారు.

పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్ల పెట్టుబడితో ఇప్యాక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉపాధి లభించనుంది. అలాగే తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000 కోట్లతో కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ పరిశ్రమ ద్వారా 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తిరుపతిలో రూ.700 కోట్ల పెట్టుబడితో డిక్సన్ టెక్నాలజీస్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యూనిట్ ద్వారా 2,300 మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఏఎం ఇంటెలిజెన్స్ సంస్థ రూ.31,387 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన కూడా అజెండాలో ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనపైనా చర్చించనున్నారు. ఈ విస్తరణతో 1,569 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటిరో గ్రూపునకు 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం 30 ఎకరాల్లో ‘ఫ్లో (FLO) ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటుపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *