
ఏపీలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకం పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో ఈ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.
దీంతో నేటి నుంచి రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ విస్తరించనుండగా. వీరి వెంట వచ్చే సహాయకులకు బస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది చేకూరనుంది. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.207 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది.
గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందనుంది. ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి.

