ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 సీసీ కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పరిణామాల పర్యవేక్షణ, రికార్డింగ్‌పై చర్చ మొదలైంది.

ఆన్‌లైన్‌లో రికార్డయిన సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరచడం ద్వారా దాని విశ్వసనీయతను కాపాడవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో రికార్డయిన దృశ్యాలను ఎడిట్ చేసే అవకాశం ఉంటుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆఫ్‌లైన్ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ భద్రతపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

పులివెందులలో 19 కెమెరాలకు గాను ఐదు మాత్రమే ఆన్‌లైన్

పులివెందుల మండలంలోనూ సీసీ కెమెరాల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల పరిధిలో మొత్తం 19 కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటిలో కేవలం ఐదు మాత్రమే ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. మిగిలిన 14 కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

for more:Mptc Zptc Live election ubdates1

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద పారదర్శకత, భద్రత కోసం సీసీ కెమెరాల పర్యవేక్షణ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లో ఉన్న కెమెరాల ఫుటేజీ కూడా సక్రమంగా భద్రపరుస్తున్నారా? వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? రికార్డయిన దృశ్యాలను మార్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై ఎన్నికల అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.