
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు సాగుతోంది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారికంగా ఈ ప్రకటన జారీ చేశారు.
రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో సర్పంచ్ పదవులతోపాటు గ్రామ పంచాయతీల వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే ఈ నెల 13న మొదటి విడత, 16న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆయా విడతలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా తాజాగా మూడో విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరిగింది.
- ఆంధ్రప్రదేశ్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
- ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇలా ఉన్నాయి.
- నవంబర్ 21: రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ చేయడంతోపాటు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు.
- నవంబర్ 21 నుంచి 23 వరకు: నామినేషన్ల స్వీకరణ. ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
- నవంబర్ 24: ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
- నవంబర్ 25: తిరస్కరణకు గురైన నామినేషన్లపై సంబంధిత ఆర్డీవోకు సాయంత్రం 5 గంటలలోపు అప్పీలు చేసుకోవచ్చు.
- నవంబర్ 26: అప్పీలేట్ అధికారులు అప్పీళ్లను పరిష్కరిస్తారు.
- నవంబర్ 27: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
- డిసెంబర్ 2: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
- డిసెంబర్ 2: అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
- ఫలితాల రోజే ఉప సర్పంచ్ ఎన్నిక
- గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఒకవేళ అదే రోజు ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే, సెలవు దినమైనప్పటికీ మరుసటి రోజు తప్పనిసరిగా ఎన్నిక చేపట్టాలి.
- రీపోలింగ్ ఉంటే డిసెంబర్ 3న..
- ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడితే డిసెంబర్ 3న పోలింగ్ చేపడతారు. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
కోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్న పంచాయతీలతోపాటు పరిపాలనాపరమైన, న్యాయపరమైన అడ్డంకులు ఉన్న పంచాయతీలు లేదా పదవులకు ఎన్నికల నోటీసులు జారీ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అలాగే రీపోలింగ్ జరిగిన పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికను రీపోలింగ్ ఫలితాలు ప్రకటించిన తర్వాతే నిర్వహించాలని సూచించింది.
25 జిల్లాల్లో మూడో విడత ఎన్నికలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాలకు మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వర్తించనుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాలకు కూడా ఈ నోటిఫికేషన్ వర్తించనుంది.
