
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అద్దంకి దర్శి నియోజకవర్గాల పరిధిలోని పది మండలాల్లో 198 గ్రామ పంచాయతీలు 2,014 వార్డు సభ్యుల స్థానాలకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లను స్వీకరించారు.
నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించారు. రెండు, మూడు పంచాయతీలకు కలిపి ఒక కేంద్రంలో నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు బుధవారం పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ పదవులకు 160, వార్డు సభ్యుల స్థానాలకు 177 నామినేషన్లు అందాయి. మొత్తంగా 337 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
