
లడఖ్‌లో నీటి కొరతను అధిగమించడంతో పాటు సింధు నది జలాలను వ్యవసాయానికి వినియోగించుకునే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. లేహ్‌లోని ఉప్షి వద్ద సింధు నదిపై దేశంలోనే తొలి రాక్ చెక్‌డ్యామ్‌ను నిర్మించారు.
సహజ బండరాళ్లను ఉపయోగించి, సిమెంట్ లేకుండానే నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌తో నీటి మట్టం సుమారు 10 అడుగుల మేర పెరిగింది. ఫలితంగా దాదాపు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ నీటిని ఇగూ ఫే సాగునీటి కాలువ ద్వారా పొలాలకు తరలించి వ్యవసాయ అవసరాలకు వినియోగించనున్నారు.
లడఖ్‌లో నీటి లభ్యతను మరింత పెంచేందుకు ఇలాంటి మరో 36 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు నీటి కొరతను కొంతవరకు అధిగమించే అవకాశం ఉంది.
సింధు జలాల వినియోగంలో భారత్ కీలక అడుగు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు సింధు జలాల ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్.. ఇప్పుడు ఆ జలాలను లడఖ్ ప్రజల అవసరాలకు వినియోగించే దిశగా కీలక చర్య చేపట్టింది. లడఖ్‌లోని రైతుల నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సింధు నది జలాలను సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా తొలి రాక్ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది.
లేహ్‌లోని ఉప్షి ప్రాంతంలో సింధు నదిపై ఈ చెక్‌డ్యామ్‌ను పూర్తిగా సహజ రాళ్లతో నిర్మించారు. నిర్మాణంలో ఎలాంటి సిమెంట్‌ను ఉపయోగించలేదు. భారీ సహజ బండరాళ్లతో ఏర్పాటు చేసిన ఈ చెక్‌డ్యామ్ కారణంగా నది నీటి మట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో ఇప్పటివరకు నీటి కొరత కారణంగా సాగు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక రైతులకు ప్రయోజనం కలగనుంది.
గతంలో సింధు నది లోతైన గార్జ్‌ల మధ్య తక్కువ స్థాయిలో ప్రవహించడంతో, నది నుంచి నీటిని పంపుల ద్వారా పొలాలకు తరలించడం రైతులకు సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా వసంతకాలంలో విత్తనాలు వేసే సమయంలో సాగునీటి కొరత తీవ్ర సమస్యగా మారేది.
కొత్తగా నిర్మించిన ఈ రాక్ చెక్‌డ్యామ్ సుమారు 4 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిల్వ చేసిన నీటిని ఇగూ ఫే సాగునీటి కాలువ ద్వారా ఎండిపోతున్న గ్రామీణ వ్యవసాయ భూములకు తరలించనున్నారు. దీంతో లడఖ్‌లోని నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సాగునీటి లభ్యత మరింత పెరగనుంది.
ముఖ్యంగా వసంతకాలపు పంటలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నీటి వనరులను స్థానిక అవసరాలకు సమర్థంగా వినియోగించుకోవడంలో ఈ రాక్ చెక్‌డ్యామ్ ఒక కీలక ముందడుగుగా నిలవనుంది.
