
హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రమాదకర హిమనీనద సరస్సులను అధికారులు గుర్తించారు. వీటిలో 16 సరస్సులు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా షాకో ఛో సరస్సును అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన అధికారులు.. దాని నుంచి ముప్పును తగ్గించేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై డీపీఆర్‌ను కేంద్ర సంస్థలకు సమర్పించారు. మరోవైపు, శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ద్వారా హిమనీనద సరస్సుల్లో చోటుచేసుకుంటున్న మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సిక్కింలో జీఎల్ఓఎఫ్ ముప్పు.. 16 సరస్సులు అత్యంత ప్రమాదకరం
హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ (జీఎల్ఓఎఫ్) ముప్పుతో సిక్కిం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ప్రళయం నేపథ్యంలో రాష్ట్ర అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సిక్కింలో ప్రమాదకర స్థితిలో ఉన్న 40 హిమనీనద సరస్సులను అధికారులు గుర్తించారు.
వీటిలో 16 సరస్సులను అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ-ఏలో చేర్చారు. మరో రెండు సరస్సులు కేటగిరీ-బీ కింద అధిక ప్రమాదకర స్థితిలో ఉండగా.. తొమ్మిది సరస్సులను కేటగిరీ-సీ కింద మధ్యస్థ నుంచి తక్కువ ప్రమాదం ఉన్నవిగా వర్గీకరించారు. మిగిలిన 13 సరస్సులకు సంబంధించి వర్గీకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
రాష్ట్రంలో జీఎల్ఓఎఫ్ ముప్పు అత్యధికంగా ఉన్న సరస్సుగా షాకో ఛోను అధికారులు గుర్తించారు. ఈ సరస్సు నుంచి ముప్పును తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సమర్పించారు. అదేవిధంగా మరో ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
హిమనీనదాలు కరిగిపోవడంతో వాటి పరిసరాల్లో నీరు పేరుకుపోయి సరస్సులు ఏర్పడతాయి. ఈ సరస్సుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి.. సరస్సు కట్ట తెగిపోవడం లేదా భారీగా నీరు బయటకు రావడాన్ని గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ అంటారు. ఇలాంటి ఘటనలు సంభవించినప్పుడు భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాల వైపు వేగంగా దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో కొండ ప్రాంతాల్లోని ప్రజలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
సిక్కింలో హిమనీనద సరస్సుల్లో చోటుచేసుకునే మార్పులను ముందుగానే గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ టాంబే తెలిపారు. సరస్సుల విస్తీర్ణం, నీటి మట్టం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చోటుచేసుకునే భౌగోళిక మార్పులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా సంభావ్య ప్రమాదాలను ముందుగానే గుర్తించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
గ్లేషియల్ లేక్ అవుట్బర్ట్స్ ఫ్లడ్ (GLOF) ముప్పును సిక్కిం గతంలోనే తీవ్రంగా ఎదుర్కొంది. 2023 అక్టోబర్‌లో సంభవించిన భారీ GLOF ఘటనలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోగా, మాంగన్, గ్యాంగ్‌టక్, పాక్యాంగ్, నామ్చి జిల్లాల్లో మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో చుంగ్‌థాంగ్ డ్యామ్ కూడా ధ్వంసమైంది.
ఈ విషాద అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సిక్కిం ప్రభుత్వం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్న హిమనీనద సరస్సులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సరస్సుల పరిస్థితిని నిరంతరం అంచనా వేయడం, ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
