
ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని గరివిడి జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స పూజిత ఆధిక్యం సాధించారు.
వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స పూజిత, తన సమీప ప్రత్యర్థి టీడీపీ కూటమి అభ్యర్థి కిమిడి సంధ్యపై ముందంజలో కొనసాగుతున్నారు. కిమిడి సంధ్య, టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు కోడలు కాగా, బొత్స పూజిత వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కోడలు.
తొలుత బొత్స పూజిత 10 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆ తర్వాత ఆమె లీడ్ 12 ఓట్లకు పెరిగింది. దీంతో గరివిడి జడ్పీటీసీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెలువడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
