
విశాఖ మెట్రో రైలు నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. విశాఖ మెట్రోకు త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు రానున్నట్లు తెలిపారు. 3 ఏళ్లలో వైజాగ్ మెట్రోను పూర్తి చేస్తామని తెలిపారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. అదే సమయంలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అటు.. విజయవాడ మెట్రో నిర్మాణంపైనా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని అయిన విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో.. అందుకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన చేస్తోంది. అందులో భాగంగానే విశాఖలో మెట్రో, సెమీ రింగ్ రోడ్డు, నగర రోడ్లకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు రానున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రైడర్స్ సంస్థ అధ్యయనం చేస్తోందని వివరించారు. ఆ సంస్థ అధ్యయనం 2 నెలల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విశాఖ మెట్రో నిర్మాణం కోసం టెండర్లను పిలవనున్నట్లు వెల్లడించారు. 3 ఏళ్లల్లో వైజాగ్ మెట్రోను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలో పట్టణ, గృహ నిర్మాణ శాఖపై జరిగిన రీజినల్ వర్క్ షాప్‌లో పాల్గొన్న నారాయణ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

