స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాలను భావిస్తున్నామని వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు.. ఎన్నికలు ఏ విధానంలో నిర్వహించినా విజయం కూటమిదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించగా, పరిషత్ ఎన్నికల్లో అంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి 96.4 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసిందని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి 3.6 శాతం ఓట్లు అదనంగా పెరిగాయని చెప్పారు.

గతంలో 39.8 శాతం ఓట్లు సాధించిన వైసీపీ.. ప్రస్తుతం ఆ ఓట్లలో ఆరు శాతానికి పైగా కోల్పోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు. ఎన్నికల నిర్వహణ, సమన్వయం కోసం ప్రత్యేకంగా వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *