
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హకీంపేటలో నిర్వహించనున్న మూడు రోజుల మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ఆయన ప్రారంభించనున్నారు. 26 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనలో మొత్తం 150 స్టాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, నూతన విత్తన రకాలు, అధునాతన సాగు విధానాలను ప్రదర్శించనున్నారు.
పర్యటనలో రెండో రోజు మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు, రహదారులు, ఎత్తిపోతల పథకం, పామాయిల్ ఫ్యాక్టరీ తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,053 కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన మొత్తం 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
పర్యటన చివరి రోజున 10 జిల్లాల నుంచి తరలివచ్చే సుమారు 50 వేల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. మూడు రోజుల పర్యటనలో రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయం, పరిశ్రమలు, రహదారులు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే నిర్మాణాలు పూర్తయిన రూ.46.08 కోట్ల విలువైన ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు.
నవంబర్ 7న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హకీంపేటకు చేరుకుని మూడు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.
ఈ మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో 26 ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, సాగు పరికరాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలను ప్రదర్శించనున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశంగా ఉండనుంది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగు, మార్కెటింగ్ అవకాశాలు, పంటల ఆధారంగా విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించనున్నారు. రైతుమేళా తొలిరోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇక నవంబర్ 8న పర్యటన రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం, వారి ఆర్థిక స్వావలంబన, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. అనంతరం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు.
అదే రోజు హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దుద్యాలలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని, రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రారంభోత్సవాలతో నియోజకవర్గంలో విద్య, వైద్యం, పరిపాలన, పోలీసు సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఇక ఈ పర్యటనలో భాగంగా చేపట్టనున్న కీలక ప్రాజెక్టుల్లో కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2 ప్రధానమైనది. సుమారు రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులోని కొత్వాల్‌గూడ నుంచి నాచారం మీదుగా జాతీయ రహదారి 167ఎన్ వరకు ఈ రహదారి అనుసంధానం కల్పించనుంది.
అలాగే మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) రెండో దశ పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ.2,100 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరనుంది. కొడంగల్ పర్యటనలో భాగంగా చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టులు నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.
