
చిత్తూరు, చిత్తూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు పలు మండలాల్లో విజయాలు నమోదు చేస్తూ ముందంజలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరు జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాల్లోనూ పలు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
కుప్పం, శాంతిపురంలో టీడీపీ విజయపరంపర
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, కుప్పం, శాంతిపురం మండలాల్లో టీడీపీ అభ్యర్థులు పలు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నడుమూరు స్థానంలో టీడీపీ అభ్యర్థి 1,166 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. శాంతిపురం మండలంలోని సి.బండపల్లిలో 718, మొరసనపల్లిలో 414, పెద్దూరులో 428 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దండికుప్పంలో 13 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.
బంగారుపాళ్యం మండలంలోనూ టీడీపీ అభ్యర్థులు సత్తా చాటారు. చికూరుపల్లిలో 601, తుంబకుప్పంలో 460, తగ్గువారిపల్లిలో 456, సంక్రాంతిపల్లిలో 364 ఓట్ల మెజారిటీలతో విజయాలు నమోదు చేశారు. మరికొన్ని స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
తవణంపల్లి, గుడిపాలలో టీడీపీ ఆధిక్యం
తవణంపల్లి జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి జి. వెంకటేష్ చౌదరి 3,259 ఓట్లు సాధించారు. వైకాపా అభ్యర్థి హరిరెడ్డికి 2,585 ఓట్లు రావడంతో టీడీపీ అభ్యర్థి 674 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గుడిపాల ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులోనూ టీడీపీ అభ్యర్థి 780 ఓట్లు సాధించి, వైకాపా అభ్యర్థిపై 605 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగించారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, సీతమ్స్, ఎస్‌వీసీఈటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుమిగూడవద్దని హెచ్చరించారు.
మొత్తంగా చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కుప్పం, శాంతిపురం, బంగారుపాళ్యం ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు వరుస విజయాలు సాధిస్తుండగా, జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులు ప్రభావం చూపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
