
కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆర్ఆర్బీహెచ్ఆర్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని, భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే భాగస్వామ్య పక్షాల గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ గౌరవం కూడా తగ్గకుండా ముందుకు సాగాలని సూచించారు. ముందుగా ప్రజల అవసరాలు తీర్చిన తర్వాత వారి ఆకాంక్షలను నెరవేర్చుకుందామని పేర్కొన్నారు.
పిఠాపురంలో జనసేన పార్టీ కమిటీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం వచ్చిన తర్వాత కొందరు నేతలు చల్లబడ్డారని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు చేస్తానన్నారు. పిఠాపురంలో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నట్లు తెలిపారు.
గత రెండేళ్లలో పిఠాపురంలో జరిగిన అభివృద్ధి ప్రజలందరికీ కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, తాజాగా మరో రూ.1,500 కోట్లతో కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
పిఠాపురం, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. రూ.34 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. యు.కొత్తపల్లి, చేబ్రోలు ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద డిస్పెన్సరీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రూ.7 కోట్లతో 26 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో మధ్యలోనే నిలిచిపోయిన ఆరు గ్రామ ఆరోగ్య కేంద్రాల పనులను పాడా నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పిఠాపురం ప్రజలకు వారి ప్రాంతంలోనే మెరుగైన వైద్యం అందేలా ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
