బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కదలికలు రాష్ట్రంలో తీసుకుంటున్న ముందస్తు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్వాన్ ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోందని అధికారులు మంత్రికి వివరించారు.

నవంబర్ 20న మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని ఆ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటల పాటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అనిత తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చని పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. వర్షాలు ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. ప్రజలు అధికారికంగా జారీ చేసే వాతావరణ హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.

అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు

తుపాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సహాయం పొందేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని అనిత తెలిపారు.

విద్యుత్ అంతరాయం చెట్లు కూలిపోవడం రోడ్లపై నీరు నిలిచిపోవడం ఇతర సమస్యలపై మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించాలని సూచించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు ఏవైనా అత్యవసర సమస్యలు ఎదురైతే స్థానిక అధికారులను సంప్రదించాలని హోంమంత్రి కోరారు. తుపాను సమయంలో కూలిన విద్యుత్ స్తంభాలు తెగిపడిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లవద్దని హెచ్చరించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *