నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదోవరోజు శ్రీభ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ్రీభ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న భ్రమరాంబికాదేవిని పలురకాల సువాసనల పుష్పాలు, బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అలంకరించారు. అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రోచ్ఛారణలతో సుగంధ ద్రవ్యాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర నీరాజనాలు అందించారు.

నయన మనోహరంగా గ్రామోత్సవం

ప్రత్యేక పూజల అనంతరం శ్రీ స్వామి-అమ్మవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయం లోపలి నుంచి బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం కదలివచ్చింది. ఉత్సవమూర్తుల ఊరేగింపు ముందు కోలాటాలు, కేరళ చండీ మేళం, కొమ్ము కోయ నృత్యం, రాజబటుల వేషధారణలు, సాంప్రదాయ విళక్క నృత్యం, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన సాంస్కృతిక విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీధుల గుండా ఊరేగుతున్న స్వామి-అమ్మవార్లను భక్తులు దర్శించుకుని, కర్పూర నీరాజనాలు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *