
తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలు ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా త్రిబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు.
తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించారని తెలిపారు. సుమారు 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం నమోదు చేయడం ప్రజల మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మరింత మెరుగైన ఆదరణ లభించిందని చెప్పారు.
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం 16 ఎంపీపీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం, తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ విజయం సాధించడం ప్రత్యేకమని అన్నారు.
తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో పాటు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల సమన్వయంతో ఎన్టీఆర్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు తమ పదవులను బాధ్యతగా భావించాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు.
గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు భిన్నంగా ప్రస్తుత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎంపీ పేర్కొన్నారు. ఎలాంటి హింస, అక్రమాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తికావడం సంతోషకరమన్నారు. తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూనే సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
