
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో నగరంలోని శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు.
నగరంలోని కేసీ కెనాల్ సమీపంలోని సత్యనారాయణ స్వామి ఆలయం, వన్‌టౌన్‌లోని శివాలయం, జమ్మిచెట్టు సమీపంలోని లలితా పీఠం, నెహ్రూనగర్‌లోని సత్యసాయి మందిరం, అశోక్‌నగర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం, సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రాల్లో సోమవారం సాయంత్రం భక్తుల సందడి కనిపించింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు.
కాల్వబుగ్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
మరోవైపు మండలంలోని ప్రసిద్ధ కాల్వబుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక తొలి సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ఉసిరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, కల్లె లక్ష్మీనరసింహ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో మద్దిలేటి ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, ధర్మకర్తల ఆధ్వర్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తుల శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
