
విజయవాడ, దీపావళి, అమావాస్య పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన అమావాస్యతో పాటు దీపావళి పండుగ కూడా కలిసి రావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
ఇటీవల నిలిచిపోయిన ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు రాకపోకలను అధికారులు పునరుద్ధరించడంతో భక్తులకు కొండపైకి చేరుకోవడం సులభమైంది. దేవస్థానం బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లోనూ భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. కనకదుర్గ మహామండపం మార్గం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్యూలైన్లను క్రమబద్ధీకరించి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన
పర్వదినాల సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన ఆర్జిత సేవల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, చండీహోమం, కుంకుమార్చన, శ్రీచక్ర నవావర్ణార్చన తదితర పూజా కార్యక్రమాలకు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల క్షేమం, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీపావళి, అమావాస్య పర్వదినాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
