
కర్నూలు నగరంలో చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బుధవారం కొండారెడ్డి బురుజు సమీపంలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు.
కర్నూలు నగరపాలక సంస్థకు మొత్తం 91 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు మంజూరు కాగా.. తొలి విడతగా 30 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పాత వాహనాల స్థానంలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా జరగడంతో పాటు కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కర్నూలులో చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కర్నూలు నగర అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.140 కోట్లు కేటాయించామని, పార్కులు, రోడ్లు, మురుగు కాలువలు తదితర మౌలిక వసతుల కోసం మరో రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు టీజీ భరత్ తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
