న్యూఢిల్లీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఊరటనిచ్చింది. గతంలో ఓటర్లుగా నమోదై ఉండి, ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవడంతో తిరిగి నమోదు చేసుకునేందుకు ఫామ్‌-6 దాఖలు చేసినంత మాత్రాన ఎలాంటి విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

గతంలో ఓటర్లుగా నమోదైన వారు ఫామ్‌-6 సమర్పిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్‌ 31 కింద చర్యలు తీసుకుంటారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన ఈసీ.. అర్హులైన పాత ఓటర్లు తిరిగి నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, వారు మరే ఇతర లోక్‌సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు అయి ఉండకూడదని షరతు విధించింది. దరఖాస్తులో ఇచ్చే ప్రకటన చట్టబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.

స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం

ఈ నిర్ణయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక భాషల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. SIR ప్రక్రియలో గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, నకిలీ ఓటర్లుగా గుర్తించిన జాబితాలోని అర్హులను తిరిగి చేర్చాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు నవంబర్‌ 6న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లు తమ నివాస ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల నమోదు అధికారి (ERO), సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) లేదా బూత్‌ స్థాయి అధికారి (BLO)కు ఎన్యుమరేషన్‌ ఫామ్‌ను సమర్పించవచ్చు. గతంలో ఫామ్‌ సమర్పించకపోవడానికి గల కారణాలను అనుబంధం-బీలో పేర్కొనాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుకు అవకాశం

ఓటర్లు స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా ఫామ్‌ను అందజేయవచ్చని ఈసీ తెలిపింది. ఈసీఐనెట్‌ ద్వారా ఈ-సైన్‌ ఉపయోగించి ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. అదే సమయంలో ఓటర్ల జాబితాలో డూప్లికేట్‌ నమోదులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటం తమ రాజ్యాంగబద్ధ బాధ్యత అని ఈసీ పేర్కొంది. ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చట్టబద్ధమైన ప్రక్రియేనని, కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని గతంలోనే సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఫామ్‌-6లో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా స్పష్టం చేసింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *