మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోయిందా? అందులోని నగదును విత్‌డ్రా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే అలాంటి ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త అందించింది. ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లో ఉన్న చిన్న మొత్తాలను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేసేలా కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీనివల్ల అర్హులైన వారు ప్రత్యేకంగా క్లెయిమ్ సమర్పించాల్సిన అవసరం ఉండదు.

పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఎలా జమ అవుతాయి?

ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యజమాని కూడా అంతే మొత్తాన్ని తనవంతు వాటాగా అందిస్తారు. యజమాని వాటాలో కొంత భాగం పెన్షన్ ఖాతాకు వెళ్తుంది.

అయితే ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలను పట్టించుకోకపోవడం సాధారణంగా జరుగుతుంది. వాటిలో ఉన్న నగదును విత్‌డ్రా చేయకుండా వదిలేస్తుంటారు. కొన్నిసార్లు చిన్న మొత్తమే ఉందని నిర్లక్ష్యం చేస్తారు. ఇలా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఖాతా ఉండిపోతే అది నిష్క్రియంగా మారే అవకాశం ఉంటుంది.

రూ.1,000 వరకు ఉంటే ఆటోమేటిక్ సెటిల్మెంట్

ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాల్లో ఉన్న నగదును క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ సెటిల్మెంట్ విధానాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం.. ఇనాక్టివ్ ఖాతాలో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ మొత్తం ఉంటే, ఆ నగదును ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా బదిలీ చేస్తారు.

పీఎఫ్ రికార్డుల్లో నమోదైన బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు జమ అవుతాయి. ఇందుకోసం ఖాతాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్ సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే రూ.1,000 కంటే ఎక్కువ నగదు ఉన్న ఖాతాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న క్లెయిమ్ విధానమే వర్తిస్తుంది.

సుమారు లక్ష ఖాతాదారులకు ప్రయోజనం

ఖాతాదారుడి బ్యాంక్ వివరాలు, గుర్తింపు వివరాలను ధ్రువీకరించిన తర్వాతే ఆటోమేటిక్‌గా నగదు బదిలీ చేస్తారు. ఈ కొత్త విధానం ద్వారా సుమారు లక్ష పీఎఫ్ ఖాతాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. మొత్తం మీద దాదాపు రూ.5 కోట్ల నగదును ఖాతాదారులకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.

పీఎఫ్ ఖాతా ఎప్పుడు ఇనాక్టివ్ అవుతుంది?

పీఎఫ్ ఖాతాలో వరుసగా మూడేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా, కాంట్రిబ్యూషన్లు జమ కాకపోయినా ఖాతా నిష్క్రియంగా మారే అవకాశం ఉంటుంది. 1952 EPF నిబంధనల ప్రకారం, సభ్యుడు పదవీ విరమణ చేసిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఖాతాలోకి ఎలాంటి చెల్లింపులు రాకపోతే దాన్ని ఇనాక్టివ్ ఖాతాగా పరిగణిస్తారు.

Live Updates in DTV Digital

ఇలాంటి ఖాతాల్లోని నగదును సాధారణ విధానంలో విత్‌డ్రా చేసుకోవడం కష్టమవుతుంది. అయితే తాజాగా ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయంతో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ నిల్వ ఉన్న అర్హమైన ఇనాక్టివ్ ఖాతాదారులకు ఊరట లభించనుంది.