
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో కొందరు నిర్మాణాలు ప్రారంభించారు. మరికొందరు రైతులు కూడా భవనాల నిర్మాణానికి అనుమతులు కోరుతూ సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాళ్లాయపాలెం, మందడం ప్రాంతాల్లో రైతులు నిర్మాణ పనులు చేపట్టారు. తాళ్లాయపాలెంలో ఓ రైతు జీ+4 భవనం నిర్మిస్తుండగా.. మందడంలో మరో భవనం కోసం సెల్లార్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో ఇవే తొలి నిర్మాణాలుగా చెబుతున్నారు.
అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు తొలి దశలో భూసమీకరణ కింద తమ భూములను ఇచ్చారు. వారికి సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. ప్రస్తుతం ఆయా లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయి.
ప్లాట్లకు రహదారి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వస్తుండటంతో మరింత మంది రైతులు నిర్మాణాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చే వారికి వసతి అవసరం ఏర్పడనుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు రైతులు భవనాల నిర్మాణానికి ముందుకొస్తున్నట్లు సమాచారం. మౌలిక వసతుల పనులు పూర్తయితే మరిన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
