
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం నుంచి దేశీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం సింగపూర్‌కు బయల్దేరడంతో అంతర్జాతీయ సేవలు ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వారికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. అనంతరం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ తదితర నగరాలకు విమాన సర్వీసులు బయల్దేరాయి.
పలు నగరాలకు విమాన సర్వీసులు
భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ఇండియా, స్కూట్ ఎయిర్‌లైన్స్ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబికి అంతర్జాతీయ విమాన సదుపాయాలు కూడా కల్పించారు. సోమవారం మొత్తం 31 విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు 20 విద్యుత్ బస్సులను ఏర్పాటు చేశారు.
విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య సేవలకు ముగింపు
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కావడంతో విశాఖ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 10.45 గంటలకు దిల్లీకి చివరి విమానం బయల్దేరింది. ఇప్పటివరకు విశాఖ విమానాశ్రయంలో విధులు నిర్వహించిన సుమారు వెయ్యి మంది సిబ్బంది ఇకపై ఎక్కడ సేవలందిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

