
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. యాత్ర సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్ నుంచి జనవరి వరకు 54 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ నుంచి కేరళలోని కొల్లం వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా పలు ప్రధాన రైల్వే స్టేషన్ల మీదుగా వీటిని నడపనున్నారు.
ఈ రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తాయి. అలాగే పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, మావెలికర, కాయంకుళం మీదుగా కొల్లం చేరుకుంటాయి.
ప్రత్యేక రైళ్లకు సంబంధించిన తేదీలు, బయలుదేరే సమయాలు, రాక సమయాలు, బోగీల వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ సర్వీసుల ద్వారా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. ప్రయాణికులు టికెట్ల బుకింగ్, రైళ్ల సమయాల కోసం అధికారిక రైల్వే వెబ్సైట్ లేదా NTES యాప్‌లో వివరాలు పరిశీలించుకోవాలని సూచించారు.
