
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వార్డుల పునర్విభజనకు తుది ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2026న తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వార్డు నంబర్ 1 నుంచి 120 వరకు ప్రతి వార్డు పరిధిలోని ప్రాంతాలు, సరిహద్దులను కూడా ఖరారు చేసింది.
వార్డుల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌కు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అధికారులు తుది ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం తాజాగా గెజిట్ విడుదలైంది.
న్యాయపరమైన అడ్డంకులు తొలగింపు
జీవీఎంసీ వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. జనగణన-2027 నేపథ్యంలో వార్డుల సరిహద్దుల నిర్ణయం సరికాదని వారు వాదించారు. అయితే ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం.. జనగణనకు, వార్డుల పునర్విభజనకు ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. జీవీఎంసీ సరిహద్దులు మార్చకుండా కేవలం వార్డులను పునర్విభజిస్తున్నందున జోక్యం అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో వార్డుల పునర్విభజనకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. అనంతరం అభ్యంతరాలను పరిశీలించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
త్వరలో జీవీఎంసీ ఎన్నికలు
తుది గెజిట్ విడుదలతో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇక 120 వార్డులతో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం ఉంది.
16వ ఆర్థిక సంఘం నిధుల కోసం అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందనే చర్చ నేపథ్యంలో, జీవీఎంసీ ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
