కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఘన విజయం సాధించేలా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని కూటమి నాయకులు నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కూడిన ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశానికి టీడీపీ జోన్‌–5 సమన్వయకర్త, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, జనసేన సమన్వయకర్త చిలకం మధుసూదన్‌రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు చింతా సురేష్, రేఖ గౌడ్, అర్షద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి. రామకృష్ణ పరమహంస, రాష్ట్ర నిర్మాణ కమిటీ సభ్యుడు విట్టా రమేష్ హాజరయ్యారు.

ఎన్నికల నేపథ్యంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామ, మండల స్థాయిల నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలు సూచించారు. ఎన్నికల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి, ఎన్డీఏ కూటమి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *