క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతిలోని అంబేద్కర్ కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

వేదికపైకి సీఎం చంద్రబాబు రాగానే వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు వేదికపై సెల్ఫీ దిగారు.

జేపీ నడ్డా నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో వైద్య రంగానికి ఇంతటి ప్రోత్సాహం లభిస్తోందని చంద్రబాబు అన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదేనని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమని సీఎం అన్నారు. దేశంలో మెడికల్ సీట్ల సంఖ్యను 51 వేల నుంచి రెండింతలకు పైగా పెంచినట్లు తెలిపారు.

మంగళగిరి ఎయిమ్స్‌ను అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు తక్కువ ధరకు మందులు అందుతున్నాయని చెప్పారు. అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.

అమరావతిలో ప్రతిపాదిత బయో-క్వాంటం వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం చంద్రబాబు కోరారు. వైద్య, ఆరోగ్య రంగంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *