రాయలసీమలో మరో కీలక జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. కడప-చెన్నై జాతీయ రహదారిలో భాగంగా కడప నుంచి రేణిగుంట వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప నుంచి రేణిగుంటకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. తిరుపతి, చెన్నై వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయోజనం కలగనుంది.

రూ.2,254 కోట్లతో నాలుగు లేన్ల రహదారి

ఎన్‌హెచ్‌-716లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును 122 కిలోమీటర్ల మేర రూ.2,254 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. కడప, భాకరాపేట, ఒంటిమిట్ట, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, మామండూరు మీదుగా రేణిగుంట వరకు ఈ రహదారి నిర్మాణం జరగనుంది.

ప్రస్తుతం కడప నుంచి రేణిగుంటకు చేరుకోవడానికి సుమారు నాలుగు గంటలు పడుతోంది. నాలుగు లేన్ల హైవే అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణాన్ని రెండు గంటల్లో పూర్తి చేయవచ్చని అంచనా. ట్రాఫిక్‌ రద్దీ తగ్గడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.

ఐదేళ్ల తర్వాత ప్రారంభమైన పనులు

ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు కేంద్రం 2021లోనే అనుమతులు ఇచ్చింది. అయితే అటవీశాఖ అనుమతులు, భూసేకరణ, ఇతర పరిపాలనా సమస్యలతో పనులు ఆలస్యమయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించింది. 2025 అక్టోబరులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

ప్రస్తుతం కడప జిల్లాలో పనులు వేగంగా సాగుతున్నాయి. రైల్వేకోడూరు-రేణిగుంట మధ్య అటవీ భూముల్లో చెట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. భూసేకరణ, పరిహారం పంపిణీ, నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి.

ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయలసీమ నుంచి తిరుపతి, చెన్నై వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలకూ మేలు జరగనుంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు.

By Ramya