
మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితిపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశముందని అధికారులు మంత్రికి వివరించారు.
ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనిత ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ లైన్లపై పడే ప్రమాదం ఉన్న చెట్లను ముందుగానే తొలగించాలని విద్యుత్, మొబైల్ నెట్వర్క్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మత్స్యకారులు తమ బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునేలా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. రాబోయే 48 గంటల పాటు అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
గాలుల కారణంగా తెగిపడే విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కనిపించినా ప్రమాదం చోటుచేసుకున్నా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుఫాన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అనిత వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
తుఫాన్ సంబంధిత సమస్యలపై తక్షణ సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను సంప్రదించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విపత్తుల నిర్వహణ సంస్థ హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1070, 18004250101కు ఫోన్ చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
