ఆరోగ్యకరమైన సమాజ స్థాపనే లక్ష్యంగా నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం తండేంవలసలోని డంపింగ్‌యార్డును సందర్శించి అక్కడ కొనసాగుతున్న లెగసీ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ పనులను పరిశీలించారు.

ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించే ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డంపింగ్‌యార్డు పరిసరాల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి, కాలుష్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాసెసింగ్‌ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ నగర ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం ద్వారా పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ఇంజనీర్‌ కె. రవిశర్మ, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సృజనతో పాటు ఇంజనీరింగ్‌ ప్రజారోగ్య విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *