
దీపావళి వేడుకల సందర్భంగా అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ రోజు ఈ విషయంపై మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని వెల్లడించారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు టపాసులు కాల్చడం ఏమిటని ప్రశ్నించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఇబ్బందులను కూడా గుర్తించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.
రేణూ దేశాయ్ తన పోస్టులో.. రాత్రి 11 గంటలు దాటినా ప్రజలు పెద్ద శబ్దాలు చేసే టపాసులు కాలుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి రోజున ఈ విషయంపై స్పందించి ఉంటే తనను హిందూ వ్యతిరేకి అని విమర్శించేవారని, అందుకే ఆరోజు మౌనంగా ఉండిపోయానని తెలిపారు. అయితే దీపావళి ముగిసిన తర్వాత కూడా ఇంతటి శబ్దాలతో టపాసులు కాల్చడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ఇతరుల ఇబ్బందులను పట్టించుకోకుండా తమ ఆనందమే ముఖ్యమని భావించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎదుటివారి బాధలను అర్థం చేసుకోలేకపోవడం, కనీస సానుభూతి చూపకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
దీపాల పండుగను ఆనందంగా జరుపుకోవడంలో తప్పులేదని, కానీ వేడుకలను శబ్దాల పోటీగా మార్చకూడదని రేణూ దేశాయ్ సూచించారు. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించాలని, ఆ తర్వాత ఇతరులకు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పించాలని కోరారు. మన ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేయకూడదని హితవు పలికారు.
అంతేకాకుండా కాలుష్యం గురించి మాట్లాడటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏడాదిలో 364 రోజుల పాటు వాహనాలు, పరిశ్రమల కారణంగా కాలుష్యం వెలువడుతూనే ఉంటుందని తన పోస్టులో ప్రస్తావించారు. పండుగల సమయంలోనైనా ఇతరుల పట్ల బాధ్యతగా, దయతో వ్యవహరించాలని రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
