
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ మనసులోని మాటలను ఒక్కసారి వినాలని ఆయన పవన్ కళ్యాణ్‌ను కోరారు. తాము పవన్ కళ్యాణ్‌ను వ్యతిరేకించడం లేదని, అయితే పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గంటా అరుణ్ అనే జనసేన కార్యకర్త.. ‘పవనన్నా.. ఒక్కసారి మా ఆవేదన విను.. కొన్ని ప్రశ్నలు’ అంటూ ఓ లేఖ రూపంలో తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై కేవలం అభిమానంతో కాకుండా, ఆయనపై ఉన్న నమ్మకంతోనే రాజకీయ ప్రయాణం చేస్తున్నానని పేర్కొన్నారు. పవన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ వ్యూహం ఉంటుందని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను, చేసిన త్యాగాలను గౌరవిస్తున్నామని, అయితే ఆ క్రమంలో జనసేన పార్టీ భవిష్యత్తు దెబ్బతినకూడదని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడు వంతుల వాటా ఉంటుందని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మూడు వంతుల వాటాలో కూడా సగం స్థానాలు దక్కలేదనే అనుమానం కార్యకర్తల్లో ఉందని పేర్కొన్నారు. టీడీపీ బీ-ఫారాలు, టీడీపీ రెబెల్స్, జనసేన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పోటీ, స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపం వంటి అంశాలు జనసైనికులను అయోమయానికి గురిచేస్తున్నాయని లేఖలో ప్రస్తావించారు.
పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయలేని పరిస్థితి ఉంటే, క్షేత్రస్థాయిలో ఆ పొత్తు వల్ల జనసేనకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న సాధారణ కార్యకర్తల భవిష్యత్తు ఏమిటనే ఆందోళనను వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్‌పై తమకు కోపం లేదని, ఆయనను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన అరుణ్.. కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. పవనన్నకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా భరిస్తామని, కానీ తమ ఆవేదనను మాత్రం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మౌనంగా ఉండకుండా జనసైనికులతో ఒక్కసారి మాట్లాడాలని కోరారు.
‘పవనన్నను నమ్మి ఇంతకాలం నడిచాం.. ఇక జనసేన పార్టీ ఎటువైపు నడవాలో మీరే చెప్పాలి’ అంటూ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కార్యకర్త రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనసేన పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులు, పొత్తుల రాజకీయాలు, కార్యకర్తల భవిష్యత్తుపై చర్చకు దారితీస్తోంది.
