ఎన్నికల్లో డబ్బు ఖర్చును తగ్గించేందుకు పెద్ద నోట్ల రద్దు అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రూ.500 నోట్లను రద్దు చేసి, కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి కోరతానని తెలిపారు. డిజిటల్ కరెన్సీ ఆలోచన తనదేనని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ఖర్చు తగ్గితే రాజకీయ నాయకుల్లో సేవాభావం పెరుగుతుందని, ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచన నాయకుల్లో వస్తుందని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే సంపద సృష్టితో పాటు పేదరిక నిర్మూలన కూడా సాధ్యమని పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలపై వైసీపీ చేస్తున్న విమర్శలకు చంద్రబాబు స్పందించారు. గతంలో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ ఓడిపోయిందని అన్నారు. ఇకనైనా ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

కూటమి రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు మద్దతు తెలిపారని చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు.

తాజా మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమికి 58.90 శాతం ఓట్లు, వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం తగ్గిందని చంద్రబాబు పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *