
2029 ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఏంటో చెప్పుకొచ్చారు. కూటమి కలిసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయని.. కూటమి విడిపోతే మాత్రం 2029 ఎన్నికల్లో జగన్‌కు వన్ అసైడ్ అవుతాయన్నారు. కూటమి కలిసి ఉంటే 2014 ఎన్నికల్లా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా కొనసాగితే.. 2014లో ఎన్నికల మాదిరిగానే 2029 ఎన్నికలు కూడా టఫ్‌గా ఉంటాయంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ . జగన్ గ్రాఫ్ పెరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందని.. కూటమి కలిసి ఉంటే 2029 ఎన్నికల్లో టఫ్ ఫైట్ అవుతుందన్నారు. ఒకవేళ 2029 ఎన్నికల్లో కూటమి విడిపోతే జగన్‌కు 2019 ఎన్నికల మాదిరిగా వార్ వన్ వన్‌సైడ్ అవుతుందన్నారు. ఉండవల్లి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ఉంటుందా లేదా అన్నది ప్రధాని మోదీ చేతుల్లో ఉంటుందని.. బీజేపీ ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంటుందని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. దీని వెనుక ఒక ఎజెండా ఉంటుంది, ఓ విజన్ క్లియర్‌గా ఉందని.. అధికారం కోసం ఏదైనా చేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి కలిసి ఉంటుందా లేదా అన్నది చూడాలని.. ఎప్పుడు, ఏదైనా జరగొచ్చన్నారు. కూటమి పార్టీలు అవసరాన్ని బట్టి కలుస్తాయి.. అవసరం లేదనుకుంటే విడిపోతారన్నారు ఉండవల్లి.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసిన వెంటనే వార్ వన్ సైడ్ అయ్యిందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. గత ప్రభుత్వంలో పవన్, చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని.. అప్పుడు జగన్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని గత ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. రాజమండ్రి జైలులో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసిన రోజే 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిదో డిసైడ్ అయ్యాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం మొదలైతే కాపుల ఓట్లలో చీలిక వస్తుందని జోస్యం చెప్పారు. జగన్ కమ్మవారికి, కాపులకు వ్యతిరేకమని బాగా ప్రచారం చేశారన్నారు.

