
ఏపీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి అడుగుపెట్టారు. ఈ నెల 11న ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ప్రకటించిన ఆయన.. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తాజాగా దివంగత నందమూరి తారకరత్న కుమార్తె నిష్కతో విజయసాయిరెడ్డి ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వీరిద్దరూ కలిసి రూపొందించిన ఓ వీడియోను నిష్క సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ‘ఈ వయసులో రాజకీయాలు అవసరమా?’ అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 11న ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు అనంతరం ఆయన ప్రధానంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసినట్లు ప్రకటించారు.
మరోవైపు, తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాతో పాటు పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా రాష్ట్రంలోని వివిధ సమస్యలు, కీలక అంశాలపై స్పందిస్తున్నారు. పలు అంశాలపై వీడియోలు రూపొందించి పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దివంగత నందమూరి తారకరత్న కుమార్తె నిష్కతో కలిసి ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో నిష్క అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
‘‘తాతా.. నీ కామెంట్స్‌లో చాలామంది ఈ వయసులో రాజకీయాలు అవసరమా? ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా? అని అడుగుతున్నారు. వారికి నేనేం సమాధానం చెప్పాలి?’’ అంటూ నిష్క విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
దీనికి విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు, వ్యక్తం చేస్తున్న సందేహాలు కూడా మంచివే. వయసును బట్టి గౌరవం లభించవచ్చు. కానీ నమ్మకం మాత్రం అలా రాదు. నేను కొత్తగా కెరీర్ నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పదవిని కాపాడుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు’’ అని చెప్పారు.
‘‘నేను చెప్పే మాటలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? నేను చేయాలనుకున్న పనులు ఆచరణలోకి వస్తున్నాయా? అనే అంశాల ఆధారంగా నన్ను అంచనా వేయాలని కామెంట్లు చేస్తున్న వారికి చెప్పు. ఏడాది పాటు వేచి చూడమని చెప్పు. నేను చేస్తున్న పనులు వారికి నచ్చితే నాకు లైక్ చేయొచ్చు. ఒకవేళ నా పని నచ్చకపోతే విమర్శలు చేసిన వారికే లైక్ చేయొచ్చు. వయసును చూసి గౌరవించవచ్చు.. కానీ పనిని చూసే నమ్మకం కలుగుతుంది’’ అని విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన వయసుపై వస్తున్న విమర్శలకు విజయసాయిరెడ్డి దీటుగా స్పందించారు. ‘‘నా వయసు గురించి ప్రశ్నిస్తున్న వారికి ఇదే నా సమాధానం. నా అనుభవాన్ని, ఉత్సాహంతో ఉరకలేసే యువత శక్తిని కలిపి ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ రాజకీయాలను మార్చడమే నా ఏకైక లక్ష్యం. రాజకీయాలను బానిసత్వంగా మార్చిన విధానాలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
‘‘కొంతమంది నాయకుల మాదిరిగా నేనే పార్టీ.. నేనే సర్వస్వం అనే నియంతృత్వ ధోరణులకు పరివర్తన రాజనీతి పార్టీ (PRP)లో స్థానం లేదు. ఆత్మగౌరవాన్ని పునాదిగా చేసుకుని, కుటుంబ, కుల, మత రాజకీయ పార్టీల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మా పార్టీ ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్‌లో పాతుకుపోయిన క్షుద్ర రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ మార్పు కోసం నాతో కలిసి నడిచేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో విజయసాయిరెడ్డి పోస్టు చేశారు.
‘‘అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి, కేవలం సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కితే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారనే రోజులు ముగిశాయి. ప్రజలకు నిజమైన మేలు చేసేలా, ప్రజారంజకమైన పాలన అందించినప్పుడే వారి ఆదరణ లభిస్తుంది. ఈ విషయాన్ని ఆ రెండు రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘పరిపాలనను తమ గుప్పిట్లో పెట్టుకుని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఎన్నికల్లో గెలిచామని సంబరపడితే ఆ విజయం ఎంతోకాలం నిలవదు. ప్రజల విశ్వాసాన్ని పొందకుండా సాధించే అధికారం తాత్కాలికమే’’ అని ఆయన పేర్కొన్నారు.
