
అమరావతి: తనను తాను పులివెందుల పులిగా చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇది ఆయన రాజకీయ పిరికితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆదివారం పులివెందుల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోకుండా రాజకీయ నాటకాలకు తెరలేపడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజల మద్దతు పొందలేక ఎన్నికలను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు, సామాన్య ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వస్తుంటే వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
పోలింగ్ సందర్భంగా ఘర్షణలు, రాళ్ల దాడులతో పాటు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. మీడియా ప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటర్లను అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పులివెందుల జగన్ కుటుంబానికి రాజకీయ జాగీరు కాదని, అక్కడి ప్రజలు ఎవరికీ బానిసలు కారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు పొందే రోజులు పోయాయని అన్నారు. ఓటు వేయకుండా వెనుదిరిగి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జగన్ను ఉద్దేశించి విమర్శించారు.
పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
