మురసు తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వాగులు వంకల సమీపంలో ప్రజలు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తుఫాన్ కారణంగా తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి సహకరించాలని పవన్ కల్యాణ్ కోరారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

By Rajini