D Spiritual: Nov 20: తిరుపతిలో ఘనంగా కార్తీక దీపోత్సవం.. గోవిందరాజస్వామి, కోదండరామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు!

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం ఆలయంతో పాటు ఉపాలయాల్లో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించనున్నారు.

అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోనూ నవంబర్ 24న కార్తీక దీపోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాత్రి 8 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకురానున్నారు.

అనంతరం ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్తీక మాస పవిత్రతను చాటిచెప్పే ఈ దీపోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *