జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయనను ఒక్కసారైనా కలవాలని, ఆయనతో ఫొటో దిగాలని ఎంతోమంది అభిమానులు ఆశపడుతుంటారు. ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన పని కలకలం రేపింది.

ఖమ్మం నుంచి బయలుదేరిన సదరు అభిమాని ముందుగా మంగళగిరికి వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ ఆయన నివాసం వద్ద ఫ్లెక్సీ ప్రదర్శించాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లు అతడిని అడ్డుకున్నారు.

దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన అభిమాని కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఓ అభిమాని హల్‌చల్ చేశాడు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి దగ్గరకు వెళ్లి కత్తితో కలకలం సృష్టించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మం నగరంలోని బల్లేపల్లి ప్రాంతానికి చెందిన భట్టు సుచేతన్ నాయక్ కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి మంగళగిరి వెళ్లిన అతడు, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.

అనంతరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం వద్దకు వెళ్లాడు. జనసేన అధినేతను కలవాలంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడు. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తీర్చుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరాడు. అయితే పవన్ నివాసం వద్ద విధుల్లో ఉన్న బౌన్సర్ అతడిని అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బౌన్సర్ అడ్డుకోవడంతో సుచేతన్ ఆగ్రహానికి గురయ్యాడు. అతడిపై దాడికి ప్రయత్నించడంతో పాటు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీ, చేతులపై గాయాలు చేసుకున్నాడు. పరిస్థితిని గమనించిన బౌన్సర్లు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే సుచేతన్ కత్తితో బెదిరిస్తూ వారిపై కూడా దాడికి యత్నించాడు. దీంతో బౌన్సర్లు అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుచేతన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నివాస సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అనంతరం సుచేతన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి, అతడి కుటుంబ సభ్యులను పిలిపించి వారి వెంట పంపించారు. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు తాను గత 16 రోజులుగా ప్రయత్నిస్తున్నానని సుచేతన్ తెలిపాడు. తన ఆర్థిక ఇబ్బందులను ఫ్లెక్సీపై రాసుకొచ్చిన అతడు.. రోజుల తరబడి ఆహారం లేకుండా రోడ్లపైనే గడిపానని చెప్పాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా జనసేన అధినేతను కలిసే అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ తన ప్రయత్నాలను వివరించాడు. ‘నా పోరాటం నిజం.. నా ఆశ ఇంకా బతికే ఉంది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

సుచేతన్ ఓ అభిమానిగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆశపడటంలో తప్పులేదు. అయితే తన వ్యక్తిగత అప్పులు తీర్చుకునేందుకు ఆయన నుంచి ఆర్థిక సాయం కోరడం మాత్రం సరైన విధానం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానుల ఆకాంక్షలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎంత ముఖ్యమో, తమ అభిమాన నాయకుడి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా అభిమానులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా అనేక బాధ్యతలతో నిరంతరం బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సమయాన్ని, బాధ్యతలను అభిమానులు గౌరవించాలని సూచిస్తున్నారు. అభిమానమంటే ప్రేమ, అభిమానం మాత్రమే కాదు.. తమ నాయకుడి పరిస్థితులను అర్థం చేసుకుని సంయమనం పాటించడం కూడా అని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *