ఈ ఘనత సాధించిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర న్యూజిలాండ్‌పై సెంచరీతో రికార్డు సృష్టించిన భారత వైస్ కెప్టెన్‌ టెస్టుల్లో 13వ శతకం నమోదు

వెల్లింగ్టన్, నవంబర్ 21,

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో ఓపెనర్‌గా సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం 207 బంతుల్లో శతకం పూర్తి చేసి ఈ ఘనత అందుకున్నాడు. ఇది అతడికి టెస్టుల్లో 13వ సెంచరీ.

34 ఏళ్ల రాహుల్‌ ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ ఉన్నారు.

సయీద్ అన్వర్‌తో ప్రత్యేక ఘనత

సెనా దేశాల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి నాలుగు దేశాల్లోనూ టెస్టు సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రాహుల్‌, పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ మాత్రమే ఉన్నారు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా గడ్డలపై శతకాలు సాధించిన రాహుల్‌.. తాజాగా న్యూజిలాండ్‌పై సెంచరీతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు. అతడి మొత్తం టెస్టు సెంచరీల్లో స్వదేశంలో మూడు, విదేశీ గడ్డపై పది ఉన్నాయి.

ఓపెనర్లలోనూ సత్తా

2021 నుంచి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న రాహుల్‌ ఏడు సెంచరీలు సాధించాడు. ఈ విషయంలో బెన్ డకెట్‌, యశస్వి జైస్వాల్‌, దిముత్ కరుణరత్నెతో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌లోనూ నాలుగు శతకాలతో టామ్ లాథమ్‌, ట్రావిస్ హెడ్‌తో కలిసి ఓపెనర్లలో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

భారత ఓపెనర్ల టెస్టు సెంచరీల జాబితాలో రాహుల్‌ 12 శతకాలతో మురళీ విజయ్‌తో సమంగా ఉన్నాడు. ఈ జాబితాలో 33 సెంచరీలతో సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉండగా, 22 శతకాలతో వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్‌, రోహిత్ శర్మ తొమ్మిదేసి సెంచరీలు సాధించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *