
బీజేపీ సీనియర్ నాయకుడు, భారతరత్న పురస్కార గ్రహీత ఎల్కే అద్వానీ తన జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ఆయన వందో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీ రాజకీయ ప్రస్థానంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాలను గుర్తుచేసుకున్నారు.
దేశ విభజన సమయంలో సింధ్‌ను విడిచి భారత్‌కు చేరుకున్న అద్వానీ.. జనసంఘ్ బలోపేతం నుంచి భారతీయ జనతా పార్టీ నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించారని మోదీ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోరాటం, సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లని గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలను ప్రశంసించారు.
రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా పుస్తక పఠనం, సినిమాలు, సింధీ సంస్కృతిపై అద్వానీకి ఉన్న ఆసక్తిని కూడా ప్రధాని ప్రస్తావించారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2024లో భారతరత్న పురస్కారం లభించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అద్వానీకి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు
భారత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నాయకుడు, భారతరత్న ఎల్కే అద్వానీ నవంబర్ 8న తన 99వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ జీవితంలో వందో ఏడాది ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో, జనసంఘ్‌తో పాటు బీజేపీ నిర్మాణంలో ఆయన అందించిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. పార్టీకి బలమైన సిద్ధాంతపరమైన పునాది వేయడంతో పాటు, అనేక తరాల కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలిచిన ఆయన కృషిని ప్రశంసించారు.
విభజన కష్టాల నుంచి రాజకీయ ప్రస్థానం వరకు
1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో ఎల్కే అద్వానీ జన్మించారు. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1947లో దేశ విభజన సమయంలో స్వస్థలమైన సింధ్‌ను విడిచి భారత్‌కు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించి కొత్త జీవితాన్ని ప్రారంభించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
రాజస్థాన్‌లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేసిన అద్వానీ, అనంతరం ఢిల్లీకి చేరుకుని భారతీయ జనసంఘ్ బలోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలో అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేశారు. రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఇద్దరూ పరస్పర సమన్వయంతో ముందుకు సాగడం భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎల్కే అద్వానీ, 1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు, చర్చల్లో పాల్గొన్న తీరు వివిధ పార్టీల నాయకుల ప్రశంసలు అందుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాసంలో గుర్తుచేశారు. ఆ తర్వాత లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం
1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అద్వానీ కీలకంగా పోరాడారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎదురైన అనుభవాలు, రాజకీయ పరిణామాలను ఆయన ‘A Prisoner’s Scrap-Book’ అనే పుస్తకంలో పొందుపరిచారని గుర్తుచేశారు. అందులోని ‘A Tale of Two Emergencies’ అనే అధ్యాయంలో 1975లో భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను, 1933లో నాజీ జర్మనీలో చోటుచేసుకున్న పరిణామాలతో పోల్చిన అంశాన్ని మోదీ ప్రస్తావించారు.
అలాగే భారత జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, నిర్మాణం, విస్తరణ వరకు అద్వానీ అందించిన సేవలు అత్యంత కీలకమని ప్రధాని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్రను ప్రత్యేకంగా గుర్తుచేశారు.
