మినీ స్ట్రోక్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత, కొద్దిసేపు చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించి… కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే వాటిని చిన్న సమస్యగా తీసుకోవద్దు. ఇవి మినీ స్ట్రోక్ లేదా ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA) సంకేతాలు కావచ్చు. ఇది భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన స్ట్రోక్‌కు ముందస్తు హెచ్చరికగా భావిస్తారు.
మినీ స్ట్రోక్ అంటే ఏమిటి?
మెదడులోని ఒక భాగానికి కొద్దిసేపు రక్తప్రసరణ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం వల్ల మినీ స్ట్రోక్ వస్తుంది. లక్షణాలు కొన్ని నిమిషాలు లేదా గంటలోపే తగ్గిపోయినా, ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని భావించకూడదు. సరైన చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మినీ స్ట్రోక్ లక్షణాలు
- ముఖం ఒకవైపు వాలిపోవడం
- ఒక చేయి లేదా కాలు బలహీనంగా అనిపించడం లేదా స్పర్శ తగ్గిపోవడం
- మాట్లాడటంలో లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
- ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం లేదా తగ్గిపోవడం
- అకస్మాత్తుగా తలతిరగడం, సమతుల్యత కోల్పోవడం
- కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి
ఈ లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోయినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- అధిక రక్తపోటు ఉన్నవారు
- మధుమేహం ఉన్నవారు
- అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు
- ధూమపానం చేసేవారు
- ఊబకాయంతో బాధపడేవారు
- గుండె జబ్బులు ఉన్నవారు
- 55 సంవత్సరాలు పైబడినవారు
- కుటుంబంలో స్ట్రోక్ చరిత్ర ఉన్నవారు
స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి చేరుకుంటే మెదడుకు కలిగే నష్టాన్ని తగ్గించే చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
మినీ స్ట్రోక్‌ను ఎలా నివారించాలి?
- రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
- వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- మినీ స్ట్రోక్ వచ్చిన అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

