జిల్లాలోని 15 మండల పరిషత్‌లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ గురువారం పూర్తయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిటర్నింగ్‌ అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికలు నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక చేపట్టారు. ఎంపీపీ అభ్యర్థి పేరును ఒక ఎంపీటీసీ ప్రతిపాదించగా మరో సభ్యుడు బలపరిచారు.

అనంతరం రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించి చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు, ఎంపీటీసీ సభ్యులు మినహా ఇతరులను కార్యాలయాల్లోకి అనుమతించలేదు.

ఎన్నికల అనంతరం పలు మండలాల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు తమ స్థానాల్లో ఆశీనులై వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన వారికి పార్టీ శ్రేణులు పూలమాలలతో స్వాగతం పలికి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. జిల్లాలోని 15 మండలాల్లో 12 చోట్ల టీడీపీ, రెండు చోట్ల వైసీపీ, ఒక చోట జనసేన అభ్యర్థులు ఎంపీపీ పదవులను దక్కించుకున్నారు.

గుమ్మలక్ష్మీపురంలో సమాన బలాబలాలు

గుమ్మలక్ష్మీపురం మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ, వైసీపీ చెరో ఏడు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే వైసీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు ఎన్నికకు హాజరుకాలేదు. దీంతో టీడీపీకి చెందిన బిడ్డిక పద్మావతి ఎంపీపీగా శొంట్యాన రమ్య వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యారు. తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుడిని దాచిపెట్టారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.

ఉత్కంఠ మధ్య పాలకొండ ఎంపీపీ ఎన్నిక

పాలకొండ మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. కూటమి పార్టీల నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఎన్నికను ఆసక్తికరంగా మార్చాయి. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో 11 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఎంపీపీ పదవి కోసం టీడీపీలోని రెండు వర్గాలు తమ అభ్యర్థుల తరఫున ప్రయత్నాలు చేశాయి.

టీడీపీ సీనియర్‌ నాయకుడు కర్నేన అప్పలనాయుడు భార్య కర్నేన యోగితకు ఎంపీపీ పదవి దక్కేలా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రయత్నించగా పాలకొండ మండల టీడీపీ అధ్యక్షుడు గండి రామినాయుడు కోడలు తాడేల గౌతమికి అవకాశం కల్పించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి చొరవ తీసుకున్నారు. దీంతో కూటమిలో రెండు వర్గాలు ఏర్పడి తమ అభ్యర్థుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం బుధవారం అర్ధరాత్రి గౌతమికి బీఫారం అందజేసింది. గురువారం జరిగిన ఎన్నికలో జిల్లా జనరల్‌ ఎన్నికల పరిశీలకుడు చినరాముడు, రిటర్నింగ్‌ అధికారి టి. వైకుంఠరావు చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. గౌతమికి ఆమెతో పాటు మరో ఇద్దరు సభ్యులు మద్దతు తెలపగా యోగితకు ఆమెతో కలిపి మొత్తం తొమ్మిది మంది మద్దతు పలికారు. దీంతో కర్నేన యోగిత ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

వైస్‌ ఎంపీపీగా గొర్లె వరలక్ష్మికి ఎనిమిది మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ఎం. రాంబాబు ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకన్న ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *