
D Spiritual: Nov 20: టీటీడీ నియామకాలపై కీలక స్పష్టత.. 1:2 నిష్పత్తిలో ఎలాంటి మార్పులు చేయలేదు!
తిరుమల: టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని మార్చి, కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని, నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ అంశంపై భక్తులు, నిరుద్యోగులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
