
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా, ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలిదశలో రాష్ట్రంలోని 3,967 గ్రామ పంచాయతీలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఆయా ఎన్నికల నిర్వహణపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాల ప్రకటన వరకు పోలీసులు, ఎన్నికల అధికారులు కూటమికి అనుకూలంగా వ్యవహరించారని వారు ఆరోపించారు.
పలు ప్రాంతాల్లో ఎన్నికల అక్రమాలు, రిగ్గింగ్ జరిగినా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోలేదని వైసీపీ నాయకులు విమర్శించారు. అధికార కూటమి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం వల్లే తమ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగి ఉంటే మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో తాజాగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా సాగుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
