
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్, త్రివిక్రమ్ గత సినిమా ఫలితం, ఇతర హీరోలు ఇదే తరహా కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తుండటం ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా రద్దయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
రూ.500 కోట్ల బడ్జెట్‌తో భారీ ప్లాన్!
‘ఆదర్శ కుటుంబం’ తర్వాత ఎన్టీఆర్‌తో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రాన్ని రూపొందించాలని త్రివిక్రమ్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా త్రివిక్రమ్‌కు తొలి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కానుంది.
అయితే ఇంతటి భారీ బడ్జెట్‌ను కేవలం దక్షిణాది మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టడం రిస్క్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ కథపై నమ్మకంతోనే నిర్మాతలు ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు టాక్.
త్రివిక్రమ్ ట్రాక్ రికార్డ్ ప్రభావం చూపిస్తోందా?
‘గుంటూరు కారం’ తర్వాత కొంత విరామం తీసుకుని త్రివిక్రమ్ రూపొందించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు మొదట మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు మందగించినట్లు ప్రచారం జరిగింది. అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడం, విడుదల తేదీలు వాయిదా పడటం వంటి అంశాలు కూడా తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపుతున్నాయనే చర్చ సాగుతోంది.
త్రివిక్రమ్ గత చిత్రం భారీ విజయం సాధించి ఉంటే ‘గాడ్ ఆఫ్ వార్’ వెంటనే ప్రారంభమయ్యేదని, ప్రస్తుత పరిస్థితుల్లో మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కుమారస్వామి కాన్సెప్ట్‌తో ఇతర సినిమాలు!
ఈ సినిమాలో కుమారస్వామి నేపథ్యానికి సంబంధించిన కథాంశం ఉంటుందనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఇదే సమయంలో ధనుష్, శివకార్తికేయన్ వంటి హీరోలు కూడా కుమారస్వామి కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ తన ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు సమయం తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సినిమా రద్దు కాలేదు.. ఆలస్యమేనా?
హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ప్రారంభంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
