భారతదేశంలో వర్షాకాలం లేదంటే, చలికాలం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లో అల్లం టీ (Adrak ki Chai) సువాసనలు గుబాళిస్తాయి. గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి లేదా అలసటగా అనిపించినప్పుడు ఒక కప్పు వేడివేడి అల్లం టీ తాగితే వచ్చే ఉపశమనమే వేరు. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. అమితంగా అల్లం టీ తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కడుపులో మంట, ఎసిడిటీ: అల్లం స్వభావరీత్యా వేడిని కలిగిస్తుంది. రోజుకు 1 లేదా 2 కప్పుల అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ, అంతకంటే ఎక్కువ మొత్తంలో అల్లం శరీరంలోకి చేరితే, అది పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ల విడుదలను పెంచుతుంది. దీనివల్ల కడుపులో విపరీతమైన మంట, గుండెల్లో మంట (Heartburn), ఎసిడిటీ, కొన్నిసార్లు విరేచనాలు (Diarrhea) కూడా సంభవించవచ్చు.

రక్తం పలచబడటం (Blood Thinning): అల్లంలో ఉండే కొన్ని సమ్మేళనాలు రక్తం గడ్డకట్టకుండా (Blood clotting) నిరోధించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఒక రకంగా మంచిదే అయినప్పటికీ, ఇప్పటికే రక్తాన్ని పలచబరిచే మందులు (Blood thinners) వాడుతున్న వారు లేదా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఎక్కువ అల్లం టీ తాగితే రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా సర్జరీ జరగడానికి కొన్ని రోజుల ముందు అల్లం ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తారు.

నిద్రలేమి సమస్య: చాలా మంది రాత్రి పూట కూడా రిఫ్రెష్ అవ్వడానికి అల్లం టీ తాగుతుంటారు. అల్లంలో ఉండే కెఫిన్, దాని ఘాటైన గుణాలు మెదడును ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉంచుతాయి. దీనివల్ల రాత్రి పూట సహజమైన నిద్రకు భంగం కలిగి, నిద్రలేమి (Insomnia) సమస్యకు దారితీస్తుంది.

అయితే, అల్లం టీ హానికరం అని దీని అర్థం కాదు. దీనిని సరైన మోతాదులో తీసుకోవడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వికారం, వాంతులు, అజీర్ణం, కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. శస్త్రచికిత్స లేదా కీమోథెరపీ తర్వాత వచ్చే వికారం విషయంలో కూడా ఇది కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా, అల్లంలో ఉండే జింజెరోల్ అనే సమ్మేళనం శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు. ఒక కప్పు అల్లం టీ ఖచ్చితంగా ఔషధమే, కానీ రోజుకు 4-5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మోతాదును గమనించుకుంటూ చాయ్‌ను ఆస్వాదించడం ఉత్తమం!

