
హాలియా, నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా, కేఆర్ఎంబీ అనుమతులు పొందకుండానే ఏపీ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం నాగార్జునసాగర్ పరిసరాల్లో పర్యటించి, నెల్లికల్లు లిఫ్ట్ నుంచి విజయపురి సౌత్ వరకు ప్రాజెక్టు పనులను పరిశీలించింది.
అనంతరం విజయవిహార్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ జలాశయంపై తెలంగాణ, ఏపీకి సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. కొత్త సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టే ముందు కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వడంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరగాలని స్పష్టం చేశారు.
ఏడాదిగా పనులు.. తెలంగాణకు సమాచారం లేదు
ఏపీ ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నా కేఆర్ఎంబీకి, తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణకు, శ్రీశైలం బాధ్యత ఏపీకి ఉందని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టడాన్నే తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల నీటి హక్కుల పరిరక్షణలో రాజీపడబోమన్నారు.
డెడ్ స్టోరేజీలోనూ నీటి తరలింపునకు ఏర్పాట్లు
నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, కనిష్ఠ నీటిమట్టం 510 అడుగులు కాగా, 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ నీటిని తరలించేలా వాటర్‌గ్రిడ్‌ను రూపొందించినట్లు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. విజయపురి సౌత్ వద్ద నాలుగు నీటి సంపులతోపాటు ఇంటేక్వెల్ నిర్మిస్తున్నారని, అందులో 490, 530, 560 అడుగుల స్థాయిల్లో నీటి సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు.
